నార్మన్ బెతూనే వైద్య సేవలు

డా'' ద్వారకానాథ్ శాంతారామ్ కోట్నీసు గురించి :

డా'' కోట్నీసు - భారత్ - చైనా స్నేహానికి , అంతర్జాతీయ సౌహార్ద్రతకు వేగుచుక్క

చైనా ప్రజలచే అత్యధికంగా గౌరవించబడ్డ డాక్టర్. ద్వారకానాథ్ శాంతారామ్ కోట్నీసు చైనా భారత్ ల మధ్య వారధిగా కొనియాడబడ్డారు. డా''డి.యస్.కోట్నీసు భారత్ లోని మహారాష్ట్రలోని షోలాపూర్ లో అక్టోబర్ 10, 1910 లో జన్మించారు. చైనా లోని హీబై ప్రావిన్స్ లోని, టాన్గ్జియాన్ కౌంటీలోని గీగాంగ్ గ్రామంలో డిసెంబర్ -9, 1942 లో తన 32వ ఏట మరణించారు. ఈ తేదీల మధ్య జరిగిన సంఘటనలే ఒక సామాన్య మానవుడు అమరజీవిగా పరిణామం చెందిన అమరగాధకు సాక్షీ భూతాలు.

డా'' కోట్నీసు వందకోట్ల పై చిలుకు చైనా ప్రజలకు అత్యంత ప్రేమస్పదుడైన సాహసవీరుడు. చైనా ప్రజలు ఆయనను ప్రేమగా డాక్టర్ కె.డి.హువా అని పిలుచుకొనేవారు. శ్రీ శాంతారామ్, శ్రీమతి సీతలకు, మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు డా'' కోట్నీసు. ఇద్దరు కుమారులు, ఐదుగురు కుమార్తెల మధ్య డా'' కోట్నీసు రెండవ కుమారుడు. కుటుంబ సభ్యులు డాక్టర్ గారిని 'బాబా' అని ముద్దుగా పిలిచేవారు. బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా జరిగిన అనేక పోరాటఘటనలను చూస్తూ కోట్నీసు ఎదిగారు. స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తిని అణువణువునా నింపుకొన్నారు. అనేక కష్టాలమధ్య 1936లో బొంబాయిలోని డి.యస్.మెడికల్ కాలేజీ నుండి కోట్నీసు డాక్టరు పట్టా పొందారు. హవాయి దేశంలోని మోలోకాయీ దీవిలో కుష్టురోగుల సేవలో తన జీవితాన్ని త్యాగం చేసిన బెల్జియం దేశానికి చెందిన వైద్యుడు ఫాదర్ డెమైన్ జీవితగాద యువ కోట్నిసు ఫై ప్రగాఢ ప్రభావాన్ని చూపింది. డా''ఫాదర్ డెమైన్ కుష్టు వ్యాధి పీడితుల సేవలో తాను కుష్టువ్యాధి బారినపడినప్పటికీ తన వైద్యం నిమిత్తం ఆ దీవులను, అక్కడి తన సేవా కార్యక్రమాలను విడిచిపెట్టడానికి తిరస్కరించిన మహానుభావుడు.

వివాహం కొరకు కుటుంబ ఒత్తిడిని ప్రక్కన బెట్టిన కోట్నీసు ప్రయివేటు ప్రాక్టీసు చేసి డబ్బు సంపాదించుటకుగాని, ఉన్నత చదువులకు పోవుటకుగాని ఇష్టపడలేదు. 1938లో రెండవ చైనా-జపనీస్ యుద్ధంలో చైనా ప్రజలకు వైద్య సేవలందించుటకు భారత్ నుండి చైనాకు పంపబడిన ఐదుగురు వైద్యుల బృందంలో స్వచ్ఛందంగా చేరారు డా'' కోట్నీసు. ఈ టీమ్ లో డా'' యమ్ అటల్, డా'' బి.కె. బాసు, డా'' యమ్. చోల్కర్, డా'' యమ్. ముఖర్జీ మరియు డా'' కోట్నీసు సభ్యులుగా ఉన్నారు. అయితే కొంత కాలానికి మిగిలిన నలుగురు వైద్యులు వెనక్కి రాగా, డా'' కోట్నీసు మాత్రం చైనా సైన్యానికి తన వైద్య సేవలు అందిస్తూ అక్కడే ఉండిపోయి, అమరజీవిగా చైనా ప్రజలచే కొనియాడబడ్డారు. 1938,సెప్టెంబర్ 2వ తేదీన భారత వైద్యుల బృందం ప్రయాణించిన స్టీమరు చైనాకు బొంబాయి నుండి బయలుదేరింది. ప్రయాణంలోనే డా. కోట్నీసు చైనా భాషను నేర్చుకోవడం మొదలుపెట్టారు. బృందంలోని సభ్యులను శారీరక వ్యాయామానికి ఆయన ప్రోత్సహించారు. స్టీమర్ బోర్డుమీదే ఎంతో శ్రద్ధాసక్తులతో ఎడ్గార్ స్నో రచించిన చైనాపై అరుణతార పుస్తకాన్ని చదివారు. ముక్యంగా చైనా విప్లవంలో అతిముఖ్య ఘట్టమైన 'లాంగ్ మార్చ్' గురించి, అలాగే విప్లవ బేస్ క్యాంపుల్లో ఎర్రసేన జీవితం గురించి ఎంతో ఆసక్తిగా చదివారు.

చైనాలో డా .కోట్నీస్ 4 సంవస్సరాలు వున్నారు . గాయపడిన సైనికులకు చికిత్స చేసి మొబైల్ వైద్యశాలలో దీక్షతో పనిచేశారు. ప్రథమంలో భారత వైద్య బృందానికి కొమింగ్ ట్యాంగ్ తో సంబంధం ఉండింది. త్వరలోనే చేవలేని కొమింటాంగ్ జాతీయ సైన్యాలను విడిచిపెట్టి , జపాన్ సైన్యంతో వీరోచితంగా పోరాడుతున్న, క్షతగాత్రులలో నిండిపోతున్న 8వ రూట్ ఆర్మీ కి వైద్యసేవలు అందించడానికి రెడ్ యానాన్ చేరుకున్నది భారత వైద్య బృందం. 1939 లో డా. కోట్నీస్ మావో నాయకత్వంలోని 8వ రూట్ ఆర్మిలో , ఉటాయ్ పర్వత ప్రాంతంలోని జిన్ చాజి సరిహద్దు వద్ద చేరుకున్నారు. వేలాది సైనికులకు కోట్నీస్ వైద్య సేవలందించారు . ఎనిమిదివందలు పైచిలుకు మేజర్ శస్త్ర చికిత్సలు నిర్వహించారు.

డా. నార్మన్ బెతూన్ వైద్యశాలకు, మెడికల్ స్కూలుకు ఇన్ చార్జిగా డా. కోట్నీస్ నియమింపబడ్డారు. ఆ తరువాత డా. కోట్నీస్ డైరెక్టరుగా , బెతూన్ మెడికల్ ఇనిస్టిట్యూట్ అంతర్జాతీయ పీస్ హాస్పిటల్ గా రూపాంతరం చెందింది. డా. నార్మన్ బెతూన్ మరణాంతరం, డా.కోట్నీస్ అంతర్జాతీయ పీస్ హాస్పిటల్ డైరెక్టరుగా నియమింపబడిన తరువాత మావో రచించిన 'ఇన్ మెమొరీ ఆప్ నార్మన్ బెతూన్' పుస్తకాన్ని అధ్యయనం చేశారు. ఆ పుస్తకం డా.కోట్నిసుపై చాలా ప్రభావం చూపింది. అంతర్జాతీయ పీస్ హాస్పిటల్ ను నడపడంలో ఈ గ్రంధం డా.కోట్నిసుకు చాలా తోడ్పడింది. "ప్రాణాపాయంలో వున్నవారిని రక్షించండి, క్షతగాత్రుల గాయాలకు చికిత్స చేయండి, విప్లవ మానతావాదాన్ని అనుసరించండి. కాలం చెల్లిన నమ్మకాలను వదిలిపెట్టండి. ఆధిక్యతాభావాన్ని, యధాతథవాదాన్ని దరిచేరనివ్వకండి." డా''.నార్మన్ బెతూన్ అందించిన నినాదం "వైద్యులారా . గాయపడిన వారి వద్దకు వెళ్ళండి, వారు మీ వద్దకు రావాలని ఎదురుచూడకండి" ను డా.కోట్నీసు అంకుఠిత దీక్షతో తూచాతప్పకుండా ఆచరణలో పెట్టారు.

చాలా కొద్దికాలంలోనే డా .కోట్నీసు చైనీస్ భాషలో అనర్గళంగా మాట్లాడటం నేర్చుకున్నారు. అంతేగాక చైనీస్ జీవిత విధానం , సంస్కృతిపట్ల ఎంతో ఆశక్తిని కనబర్చారు. అంతర్జాతీయ శాంతి హాస్పిటల్ లోని నర్సింగ్ ఇన్ స్ట్రక్టర్ 'గుయోక్వింగ్ లాన్' తో వివాహానికి ఈ శ్రద్ధాసక్తులే కారణమయ్యాయి. వారికి ఒక మగ బిడ్డ పుట్టాడు. అతని పేరు 'ఇన్ హువా ' అంటే భారత్-చైనా అని అర్ధం.

యుద్ధవాసరాలను తీర్చే నిమిత్తం డా'' కోట్నీసు విశ్రాంతిలేకుండా ఎంతో కష్టభూయిష్టమైన, ప్రమాదాలతో కూడిన జీవితాన్ని గడపాల్సివచ్చింది. విపరీతమైన పని భారం, తీవ్రమైన ఒత్తిడి ఒకవైపు ,సరైన ఆహరం, విశ్రాంతి లేని యుద్దవాతావరణం మరోవైపు డా. కోట్నీసు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. మెరుగైన వైద్యంకోసం భారత్ కానీ, హాంగ్ కాంగ్ కానీ వెళ్ళమన్న సూచనను డా'' కోట్నీసు తిరస్కరించారు. యుద్ధ భూమిలోని తన భాద్యతలను వీడివెళ్లడానికి ఇష్టపడలేదు. డా'' ఫాదర్ డెమైన్ వలె ఏది ఏమైనా తన భాద్యతలు నిర్వర్తించడానికి డా'' కోట్నీసు నిర్ణయించుకొన్నారు. డా'' నార్మన్ బెతూన్ అడుగుజాడల్లో పనిచేస్తూ ముందుకు పోయారు. చైనా కమ్మూనిస్టు పార్టీతో విడదీయరాని బంధాన్ని ఏర్పరచుకున్నారు . 1942 లో డా'' కోట్నీసు చైనా కమ్మూనిస్టు పార్టీలో సభ్యుడిగా చేరారు. చైనా కమ్మూనిస్టు పార్టీ సభ్యత్వాన్ని తన జీవితంలో తానూ పొందిన అత్యున్నత గౌరవంగా భావించారు. వారి కృషి బహుముఖాలుగా విస్తరించింది. సైన్యం అవసరాల నిమిత్తం "శస్త్ర చికిత్సలో సూచనలు" పేరుతో చైనా భాషలో ఒక పుస్తకం వ్రాయడానికి డా'' కోట్నీసు ఉపక్రమించారు. విశ్రాంతి లేని పనిభారం చివరికి డా'' కోట్నీసు అకాల మరణానికి దారితీసింది. 1942 లో డా''కోట్నీసు ఎపిలెప్సీ వ్యాధితో మరణించారు. నాన్ క్వాన్ గ్రామంలోని వీరుల స్మశాన వాటికలో ఖననం చేశారు.

జపాన్ వ్యతిరేక ప్రతిఘటనా యుద్ధంలో విజయం సాధించడానికి, తమ దేశంపై తమ ఆధిపత్యాన్ని నెలకొల్పడానికి నిర్ణయాత్మకంగా పోరాడిన చైనా ప్రజలు తమ హీరోల యెడల అత్యంత అభిమానాన్ని ప్రదర్శించారు. త్యాగం,విప్లవ సాహసం, నాయకత్వ లక్షణాలు కనబర్చిన విప్లవ వీరుల యెడల చైనా ప్రజలు అత్యంత గౌరవాన్ని ప్రదర్శించారు. డా'' బెతూన్ తరువాత డా'' కోట్నీసును చైనా రైతులు, రెడ్ ఆర్మీ సైనికులతో పాటు మహానాయకులు జూడే , ఙాయన్ లై మరియు మావో జుడాంగ్ ల గౌరవాన్ని చూరగొన్నారు .