నార్మన్ బెతూనే వైద్య సేవలు

ఆంధ్రప్రదేశ్ జన సాంస్కృతిక మండలి గురించి

నేటికీ మన సమాజంపై భూస్వామ్య సంస్కృతి ప్రభావం బలంగా వుండటంతో కులవివక్షత, అగ్రకులాధిపత్యం, పురుషాధిక్యం,మతోన్మాదం నిరాటంకంగా కొనసాగుతున్నాయి. అట్టడుగు వర్గాలైన దళితులు, అణగారిన కులాలపై అణచివేతలు, వేధింపులు, ప్రేమ పేరుతో దాడులు నిత్యకృత్యమైనాయి. శాస్త్రీయహేతువాద భావనలు వ్యాపించాల్సిన తరుణంలో కర్మసిద్దాంతాలు, పునర్జన్మలు, వాస్తుజాతకచక్రాలు, ప్రేతాత్మలు, చేతబడులాంటి మూఢ విశ్వాసాలు ప్రజల మానసిక వికాసాన్ని అడ్డుకొంటున్నాయి. మతం పేరుతో కాలంచెల్లిన మధ్యయుగాల అనాగరిక ఆచారాలు, సాంప్రదాయాలను పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు.

ప్రపంచీకరణ నేపథ్యంలో సరళీకృతా ఆర్థిక విధానం, ఆర్థిక సరళీకరణ పేరుతో స్వేచ్చావాణిజ్యనికి తలుపులు తెరవడంతో పెట్టుబడిదారీ విషసంస్కృతి ప్రవేశించి మన సమాజాన్ని కేన్సరులా పట్టిపీడిస్తోంది. ఆర్థిక రాజకీయ రంగాల్ని చుట్టుముట్టిన సామ్రాజ్యవాద ప్రపంచీకరణ సాంస్కృతిక రంగాన్ని కూడా కబళిస్తున్నది. ఏంతినాలో, ఏంత్రాగాలో ,ఏ బట్ట కట్టుకోవాలో, ఏ కాస్మొటిక్స్ పూసుకోవాలో కూడా మనలను శాసిస్తూ, అనవసర వస్తువులను అవసరవస్తువులుగా భ్రమింపచేస్తున్న వినియోగదారీ సంస్కృతి ప్రవేశించింది. వినియోగదారీ సంస్కృతి వ్యాప్తికి మహిళలు సాధనాలుగా మల్చబడుతూ,మీడియాలో అసభ్యంగా చిత్రీకరింపబడుతున్నారు. బరితెగించిన విద్యావ్యాపారం తెలుగు భాషకు గోరి కడుతున్నది. మమ్మి-డాడీ సంస్కృతి విషవృక్షంలా వ్యాపిస్తోంది. టి.వి., సినిమాలు యువతలో హింసా ప్రవృత్తిని, ప్రేమోన్మాదాలను రెచ్చగొడుతున్నాయి. సామాజిక భాద్యత, నైతిక విలువలకు యువత దూరమవుతున్నది. పచ్చిశృంగారా గీతాలు, అంగాంగ ప్రదర్శనలు,శుష్కవేదాంతాలు నేడు సాహిత్య కళారంగాలను శాసిస్తున్నాయి.

ఈ పరిస్థితిలో భూస్వామ్య,బూర్జువా సంస్కృతి స్థానే శ్రామిక సంస్కృతిని నేలుకొల్పే ప్రధాన లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ జనసాంస్కృతిక మండలి ఏర్పడినది. సామాజిక విప్లవానికి అవసరమైన భావవిప్లవాన్ని సాంస్కృతిక విప్లవం ద్వారా అందించడమే ఈ సాంస్కృతిక ప్రజాసంఘం యొక్క ముఖ్య ఉద్దేశం. భూస్వామ్య, భూర్జువాలకు వ్యతిరేకంగా జరిగే కార్మిక, కర్షక, విద్యార్థి, ఉద్యోగవర్గాల పోరాటాలకు తన పాటలతో, మాటలతో, డాన్సులతో, సంగీతంతో వివిధ కళారూపాలతో సాంస్కృతికంగా మద్దతు పలుకుతుంది. సాంస్కృతికంగా వారితో కలిసి పోరాడుతుంది. దోపిడీ సంస్కృతి స్థానే ప్రజాస్వామ్య సంస్కృతి నిలుపుటకు కృషిచేస్తుంది. పీడిత ప్రజల పోరాటాలను, ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ జానపద, ఆధునిక కళారూపాలను మిళితం చేస్తూ సృజనాత్మక శ్రామిక సంస్కృతిని నిర్మించడానికి శ్రమిస్తుంది.