నార్మన్ బెతూనే వైద్య సేవలు

కామ్రేడ్, డాక్టరు నార్మన్ బెతూన్ గురించి:

స్పెయిన్, చైనా ప్రజల విమోచన పోరాటాలను తనవిగా భావించి పరిపూర్ణ నిస్వార్థ దీక్షతో అంతర్జాతీయతా చైతన్యంతో, ఆలక్ష్య సాధనకోసం నిర్విరామకృషిచేసి విధుల నిర్వహణలో ప్రాణాలర్పించిన గొప్ప మానవతావాది, ప్రజావైద్యులు, శస్త్రచికిత్సల నిపుణులు డా .నార్మన్ బెతూన్. నెత్తురుకారే గాయాల్ని,కన్నీళ్లుకారే నయనాల్ని తుడుస్తూ తుదిస్వాస వదిలిన అమరజీవి డాక్టర్ బెతూన్. తన సమకాలీన సమాజంలో ప్రతిమనిషిని ఎదుర్కొనే ప్రధాన కర్తవ్యాలను అసమాన దీక్షతో, స్థిరసంకల్పంతో,సాహసంతో, నైపుణ్యంతో నిర్వర్తించే వ్యక్తి యే యుగంలోనైనా ఒక మహావ్యక్తి. డా .నార్మన్ బెతూన్ అటువంటి మహావ్యక్తి.

ఆయన జీవించిందీ, పనిచేసింది, పోరాడింది మూడు దేశాల్లో. ఒకటి స్వదేశమైన కెనడా, రెండు ఫాసిజానికి వ్యతిరేకంగా ప్రప్రధమ ప్రజాప్రతిఘటనా సమరం జరిగిన స్పెయిన్, మూడు-చైనా. ఒక ప్రత్యేకార్థంలో ఆయన యీ మూడు దేశాల ప్రజలకు చెందినవాడు.విపులార్థంలో పీడనకు వ్యతిరేకంగా పోరాడే సమస్త ప్రజానీకానికి ఆయన చెందుతాడు.

యుద్ధ క్షేత్రాలకు రక్త నిధులు కొనిపోయిన మొట్టమొదటి వైద్యవేత్త డా .బెతూన్. స్పానిష్ రిపబ్లిక్ తరుపున పోరాడే వందలాది యోధులు ప్రాణాలను రక్తం ఎక్కించే ప్రక్రియ ద్వారా కాపాడారు. చైనాలో ఒక కొత్త నినాదాన్ని ఆరంభించి ఆచరణలో పెట్టారు. అది "డాక్టర్స్, గాయపడ్డ వాళ్ళ దగ్గరకు మీరే వెళ్ళండి . వాళ్ళు మీ వద్దకు వచ్చేదాకా ఆగకండి".

స్పెయిన్ పరిస్థితులకు పూర్తిగా భిన్నమైన వాతావరణంలో , స్పెయిన్ కంటే ఎంతో వెనుకబడిఉన్న చైనా దేశంలో గెరిల్లా వైద్య చికిత్స విభాగాన్ని నెలకొల్పి, వేలాది ఉత్తమ , సాహసోపేత యోధుల్ని రక్షించారు. ఆయన ఆలోచనలు ,ఆచరణ-వైద్యశాస్త్రం అందులో అనుభవం మీద మాత్రమే ఆధారపడి లేవు. ఇంకా, ప్రజాయుద్దపు పోరాట రంగాలకు సంబంధించి సైనిక ,రాజకీయ విషయాల అధ్యయనం,అనుభవం మీద అవి రూపొందాయి.

క్షయతో క్షీణించిపోయిన శరీరంలో సత్తువ ఉడికిపోయి కూడా పర్వతసీమల్లో గ్రామీణ ప్రాంతాల్లో బొత్తిగా భాష తెలియని అపరిచిత ప్రజల మధ్యవుండి అనేక గురుతర కర్తవ్యాలు సాధించారు.

చైనాలో ఆయన పనిచేసిన ప్రాంతాన్ని జపాన్ సైన్యమొక్కటే చుట్టుముట్టలేదు. చాంగ్-కై-షేక్ ప్రతీప ప్రభుత్వంకూడా దిగ్బంధన చేసింది. ఏ ప్రజలకోసమైతే బెతూన్ పోరాడాడో , ఆ ప్రజలు గాయపడ్డప్పుడు మందులు మాకులు పొందే అర్హత కూడా లేకండా ఆ ప్రభుత్వం దిగ్బంధన అమలు పరిచింది. ఆధునిక మందులు కొరత వలన అనేకమంది మరణించారు. డా .బెతూన్ రబ్బరు తొడుగులు (గ్లౌస్) లేకుండా శాస్త్రచికిత్స చేస్తూ గాయపడి, రక్తం విషపూరితమై (సెప్టిక్ అయి) మరణించారు.

డా .బెతూన్ చనిపోయాక ఆయన స్థాపించిన అంతర్జాతీయ శాంతి చికిత్సలయాల్లో ఒక దానికి భారతీయ వైద్య బృందానికి చెందిన డాక్టర్ కోట్నిసు డైరెక్టరు పదవి స్వీకరించారు.